యోబు 3:1-10

యోబు 3:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. యోబు ఇలా అన్నాడు. నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది. ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు. చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి. కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు. ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది. శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి. ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు. అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?

షేర్ చేయి
Read యోబు 3

యోబు 3:1-10 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక. ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడు లక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక. ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక. గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు. ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక. శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు. ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక. ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.

షేర్ చేయి
Read యోబు 3

యోబు 3:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను– నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక. ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక

షేర్ చేయి
Read యోబు 3

యోబు 3:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు. యోబు ఇలా అన్నాడు: “నేను పుట్టిన రోజు, ‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక. ఆ రోజు చీకటి అగును గాక; పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక; దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక; మేఘం దాన్ని కమ్మును గాక; పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక. కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక; సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక, ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక. ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక; దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక. రోజులను శపించేవారు, లెవియాథన్ రెచ్చగొట్టే అనుభవం గలవారు ఆ రోజును శపించుదురు గాక. దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు. ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు.

షేర్ చేయి
Read యోబు 3