యోబు 3

3
1ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
2యోబు ఈలాగు అనెను–
3నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును
నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును
నేను పుట్టిన దినము లేకపోవును గాక
మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.
4ఆ దినము అంధకారమగును గాక
పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక
వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక
5చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ
యొద్దకు తీసికొనును గాక.
మేఘము దాని కమ్మును గాక
పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక
6అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక
సంవత్సరపు దినములలో నేనొకదాననని
అది హర్షింపకుండును గాక
మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక
7ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక
దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక
8దినములు అశుభదినములని చెప్పువారు దానిని
శపించుదురు గాక
భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని
శపించుదురు గాక.
9అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు
అంధకారము కమ్మును గాక
వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు
లేకపోవును గాక
10అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక
11పుట్టుకలోనే నేనేల చావకపోతిని?
గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము
విడువక పోతిని?
12మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?
నేనేల స్తనములను కుడిచితిని?
13లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును
నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును
14తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు
కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను
నిద్రించి నిమ్మళించియుందును.
15బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో
నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును.
16అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటి
వాడనై లేకపోయి యుందును.
వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.
17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు
బలహీనులై అలసినవారు విశ్రాంతినొందుదురు
18బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక
యేకముగా కూడి విశ్రమించుదురు
19అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు
దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని
స్వతంత్రులై యున్నారు.
20దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?
దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
21వారు మరణము నపేక్షింతురు
దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారుగాని అదివారికి దొరకక యున్నది.
22సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె
వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
24భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది
నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.
25ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే
నాకు సంభవించుచున్నది
నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
26నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు
శ్రమయే సంభవించుచున్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 3: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in