యోబు 3:1-10

యోబు 3:1-10 TERV

అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక. ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడు లక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక. ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక. గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు. ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక. శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు. ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక. ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.

Read యోబు 3