యోబు 16:1-5
యోబు 16:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు, “ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది? నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి.
యోబు 16:1-5 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: “ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను. మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు. మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు. మీరెందుకు వాదము కొనసాగిస్తారు? నా కష్టాలే మీకు ఉంటే ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను. మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి, మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను. కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.
యోబు 16:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను– ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు. ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు? నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాట లాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీవైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదును నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును
యోబు 16:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; మీరందరు నీచంగా ఓదార్చేవారు. మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది? నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను. కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.