యోహాను 5:17-24
యోహాను 5:17-24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు వారికి సమాధానం ఇస్తూ, “నా తండ్రి నేటి వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నారు, నేను కూడా చేస్తున్నాను” అని చెప్పారు. కనుక వారు, యేసు సబ్బాతు దినాన్ని పాటించకపోవడమే కాక దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ, తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడని ఆయనను చంపడానికి మరింత గట్టిగా ప్రయత్నించారు. కనుక యేసు వారితో మాట్లాడుతూ, “నేను మీతో చెప్పేది నిజం, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు; తండ్రి చేస్తున్న దానిని చూసి కుమారుడు చేస్తాడు, ఎందుకంటే తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తాను చేసే వాటన్నిటిని కుమారునికి చూపిస్తారు. అవును, మీరు ఆశ్చర్యపడేంతగా, వీటికన్నా గొప్ప కార్యాలను తండ్రి కుమారునికి చూపిస్తారు. తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తాను ఇవ్వాలనుకున్న వారికి జీవాన్ని ఇస్తారు. అంతేకాక, తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు కానీ, తండ్రిని ఘనపరచినట్లే అందరు కుమారున్ని కూడా ఘనపరచాలి. ఆయన అందరికి తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. కుమారుని ఘనపరచని వారు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచరు. “నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మువాడు, నిత్యజీవం గలవాడు మరియు అతడు మరణం నుండి జీవంలోనికి దాటాడు కనుక అతనికి తీర్పు ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
యోహాను 5:17-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు. ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు. “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు. దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు. కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.
యోహాను 5:17-24 పవిత్ర బైబిల్ (TERV)
యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు. ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు. యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు. “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు. యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.
యోహాను 5:17-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.