యోహాను 5:17-24

యోహాను 5:17-24 IRVTEL

యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు. ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు. “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు. దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు. కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.