యోహాను 5:17-24

యోహాను 5:17-24 TERV

యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు. ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు. యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు. “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు. యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.