యోహాను 18:28-40

యోహాను 18:28-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి–ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను. అందుకు పిలాతు–నేను యూదు డనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి–అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు; అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను. అయితే వారు–వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

షేర్ చేయి
Read యోహాను 18

యోహాను 18:28-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప వద్దనుంచి రోమా అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు, అప్పటికి తెల్లవారింది కనుక అపవిత్రపడకుండా పస్కాను తినాలని వారు భవనంలోనికి వెళ్లలేదు. కనుక పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఈయనకు వ్యతిరేకంగా ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు “ఆయన నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు. పిలాతు, “అతన్ని మీరే తీసుకువెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు. యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది. తర్వాత పిలాతు భవనంలోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు, “అది నీ స్వంత ఆలోచనా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు. పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్యయాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేసావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా ఉండడానికి నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు. అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు. పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఈయనను నిందించడానికి తగిన ఏ నేరం నాకు కనిపించలేదు. కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కొరకు విడుదల చేసే ఆచారం ఉంది కనుక, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

షేర్ చేయి
Read యోహాను 18

యోహాను 18:28-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు. వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.

షేర్ చేయి
Read యోహాను 18

యోహాను 18:28-40 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు. “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు. పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు. యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది. పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు. పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు. “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు. యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.” “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు. వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

షేర్ చేయి
Read యోహాను 18