యోహాను 18:28-40

యోహాను 18:28-40 IRVTEL

వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు. వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.