యోహాను 18:28-40

యోహాను 18:28-40 TERV

ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు. “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు. పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు. యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది. పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు. పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు. యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు. “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు. యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.” “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు. వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.