యోహాను 11:38-57
యోహాను 11:38-57 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరి అయిన మార్త, “కాని, ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, కనుక ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది. అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు. కనుక వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు, అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు. యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్ళు చేతులు నారవస్త్రంతో, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉన్నాయి. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు. మరియను చూడటానికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్బుత క్రియలను చేస్తున్నాడు. మనం ఆయనను అలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. ఆ తర్వాత రోమీయులు వచ్చి మన పరిశుద్ధ మందిరస్థలాన్ని మరియు మన దేశ ప్రజలను కలిపి ఈ రెండింటిని స్వాధీనం చేసుకుంటారు” అన్నారు. అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు. అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కొరకు చనిపోతాడని, మరియు ఆ దేశం కొరకు మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని, పిల్లలందరిని, ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. కనుక ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు. కనుక యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు. యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. వారు యేసు కొరకు వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావడం లేదా ఏమి?” అని చెప్పుకొంటున్నారు. మరియు యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియజేయాలని ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
యోహాను 11:38-57 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది. యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది. యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు. కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు. ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు. అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు. అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు. కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే, మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు. అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు. మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు. అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు. అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు. యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు. వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?” యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.
యోహాను 11:38-57 పవిత్ర బైబిల్ (TERV)
యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది. అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు. వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి. నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు. ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు. చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు. మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు. కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు. అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు. వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు. యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు. ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు. అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు. యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
యోహాను 11:38-57 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములనుగూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి–మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైయుండి –మీ కేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే యీలాగు చెప్ప లేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి–మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
యోహాను 11:38-57 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరియైన మార్త, “ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది. అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు. కాబట్టి వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు. యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు. మరియను చూడటానికి వచ్చిన యూదులలో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు. మనం ఆయనను ఇలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశ ప్రజలను తీసుకుపోతారు” అన్నారు. అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! ప్రజలందరు నశించిపోకుండా వారి కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు. అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కోసం చనిపోతాడని, ఆ దేశం కోసం మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలందరిని ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. కాబట్టి ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు. యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. వారు యేసు కోసం వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావట్లేదేమో!” అని చెప్పుకుంటున్నారు. యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియచేయాలని ముఖ్య యాజకులు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.