యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరి అయిన మార్త, “కాని, ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, కనుక ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది. అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు. కనుక వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు, అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు. యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్ళు చేతులు నారవస్త్రంతో, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉన్నాయి. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు. మరియను చూడటానికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్బుత క్రియలను చేస్తున్నాడు. మనం ఆయనను అలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. ఆ తర్వాత రోమీయులు వచ్చి మన పరిశుద్ధ మందిరస్థలాన్ని మరియు మన దేశ ప్రజలను కలిపి ఈ రెండింటిని స్వాధీనం చేసుకుంటారు” అన్నారు. అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు. అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కొరకు చనిపోతాడని, మరియు ఆ దేశం కొరకు మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని, పిల్లలందరిని, ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. కనుక ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు. కనుక యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు. యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. వారు యేసు కొరకు వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావడం లేదా ఏమి?” అని చెప్పుకొంటున్నారు. మరియు యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియజేయాలని ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
Read యోహాను 11
వినండి యోహాను 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 11:38-57
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు