యోహాను 11:38-57

యోహాను 11:38-57 IRVTEL

యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది. యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది. యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు. కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు. ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు. అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు. అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు. కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే, మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు. అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు. మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు. అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు. అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు. యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు. వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?” యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.