యెషయా 29:11-24
యెషయా 29:11-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు–అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు–నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు–అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు –ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారువారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతునువారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగునువారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవానిగూర్చి–ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి–ఇతనికి బుద్ధిలేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు. కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు –ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపువారు తమ మధ్య నేనుచేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.
యెషయా 29:11-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీకు ఈ దర్శనమంతా మూసి ఉన్న పుస్తకంలోని మాటల్లా ఉన్నాయి. దాన్ని మనుషులు చదవ గలిగిన వాడికిచ్చి “ఇది చదవండి” అన్నప్పుడు అతడు చూసి “నేను దీన్ని చదవలేను. ఎందుకంటే ఇది మూసి ఉంది” అంటాడు. ఒకవేళ చదువు లేనివాడికి పుస్తకాన్ని ఇచ్చి “చదువు” అంటే అతడు “నేను చదవలేను” అంటాడు. ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు. వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు. కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను. వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.” తమ ఆలోచనలు యెహోవాకి తెలియకుండా లోపలే దాచుకునే వాళ్లకీ, చీకట్లో తమ పనులు చేసే వాళ్ళకీ బాధ! “మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మేం చేసేది ఎవరికీ తెలుస్తుంది?” అని వాళ్ళు అనుకుంటారు. మీవెంత వంకర ఆలోచనలు! మట్టిని గూర్చి అలోచించినట్టే కుమ్మరి గురించి కూడా ఆలోచిస్తారా? ఒక వస్తువు తనను చేసిన వ్యక్తిని గూర్చి “అతడు నన్ను చేయలేదు” అనవచ్చా? ఒక రూపంలో ఉన్నది తన రూప కర్తని గూర్చి “అతడు అర్థం చేసుకోడు” అనవచ్చా? ఇంకా కొద్ది కాలంలోనే లెబానోను సారవంతమైన పొలం అవుతుంది. ఆ పొలం అడవిలా మారుతుంది. ఆ రోజున చెవిటి వాళ్ళు గ్రంథంలోని వాక్యాలు వింటారు. గుడ్డి వారు చిమ్మచీకట్లో కూడా చూస్తారు. అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు. వీళ్ళు కేవలం ఒక్క మాట ద్వారా ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారిస్తారు. న్యాయం కోసం వచ్చేవాడి కోసం వలలు వేస్తారు. వట్టి అబద్ధాలతో నీతిమంతుణ్ణి కూలగొడతారు. అందుచేత అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు వంశం గూర్చి ఇలా చెప్తున్నాడు. “ఇకపై యాకోబు ప్రజలు సిగ్గుపడరు. అవమానంతో వాళ్ళ ముఖం పాలిపోవు. అయితే వాళ్ళ సంతానాన్నీ, వాళ్ళ మధ్య నేను చేసే పనులనూ చూసినప్పుడు వాళ్ళు నా పేరును పవిత్ర పరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుని పేరును పవిత్రపరుస్తారు. ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. అప్పుడు ఆత్మలో పొరపాటు చేసేవారు కూడా వివేకం పొందుతారు. అదేపనిగా ఫిర్యాదులు చేసేవాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు.”
యెషయా 29:11-24 పవిత్ర బైబిల్ (TERV)
ఈ సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు గ్రహించరు అని నేను మీతో చెబుతున్నాను. మూసివేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాటల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు వుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు. లేకపోతే చదవటం రానివాడికి మీరు ఆ పుస్తకం ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. ఆ వ్యక్తి, “నాకు చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు. నా ప్రభువు అంటున్నాడు, “ఈ ప్రజలు నన్ను ప్రేమిస్తున్నామని వారు అంటారు. వారి నోటి మాటలతో నన్ను ఘనపరుస్తారు. కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మానవపరమైన నియమాలను కంఠస్థం చేయటం తప్ప వారు నాకు చూపించే గౌరవం ఇంకొకటి లేదు. అందుచేత శక్తిగల, అద్భుత కార్యాలు ఇంకా చేస్తూనే ఉండి, నేను ఈ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాను. వారి జ్ఞానులు తమ జ్ఞానం పోగొట్టుకొంటారు. వారి జ్ఞానులు గ్రహించలేక పోతారు.” ఆ ప్రజలు విషయాలను యెహోవాకు తెలియకుండా దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు. యెహోవా గ్రహించలేడు అని వారు అనుకొంటారు. వారు తమ చెడుకార్యాలను చీకట్లో చేస్తారు. “మనల్ని ఎవరూ చూడలేరు. మనం ఎవరయిందీ ఎవరూ తెలుసుకోలేరు” అని వారు చెప్పుకొంటారు. మీరు గందరగోళం అయ్యారు. మట్టి, కుమ్మరికి సమానం అని అనుకొంటారు మీరు. “నీవేమి నన్ను తయారు చేయలేదు” పొమ్మని సృష్టించబడినది, తనను సృష్టించిన వానితో చెప్పొచ్చని మీరు తలస్తారు. “నీకు తెలియదులే” అని కుమ్మరితో కుండ చెప్పినట్టుంది ఇది. అసలు సత్యం ఇది. కొంచెం కాలం తర్వాత కర్మెలు పర్వతంలాగే లెబానోను పర్వతం కూడ మంచినేల అవుతుంది. మరియు కర్మెలు పర్వతం దట్టమైన అరణ్యంలా ఉంటుంది. చెవిటివారు కూడ గ్రంథంలోని మాటలు వింటారు. గ్రుడ్డివారు చీకటి, మంచుగుండా చూస్తారు. పేద ప్రజలను యెహోవా సంతోషపరుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునిలో పేద ప్రజలు ఆనందిస్తారు. నీచులు, కృ-రులు అంతమయిన తర్వాత ఇది జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది. (ఆ మనుష్యులు మంచివాళ్లను గూర్చి అబద్ధం చెబుతారు. వారు న్యాయస్థానంలో ప్రజలను మోసం చేయాలని చూస్తారు. నిర్దోషులను వారు నాశనం చేయాలని చూస్తారు.) కనుక యాకోబు వంశంతో యెహోవా మాట్లాడుతున్నాడు. (ఈ యెహోవాయే అబ్రాహామును విడిపించింది.) యెహోవా చెబుతున్నాడు: “ఇప్పుడు యాకోబు (ఇశ్రాయేలు ప్రజలు) ఇబ్బందిపడడు, సిగ్గుపడడు. అతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా నామం పవిత్రం అని చెబు తాడు. ఈ ప్రజలందర్నీ నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరిశుద్ధుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు చెబుతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మానిస్తారు. ఈ ప్రజల్లో చాలా మందికి అర్థం గాక చెడ్డపనులు చేశారు. ఈ ప్రజలు అర్థం చేసికోలేదు కానీ వాళ్ల పాఠం వాళ్లు నేర్చుకొంటారు.”
యెషయా 29:11-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు. చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు. ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.” తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ. మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా? ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా? ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, చీకటిలో చిమ్మ చీకటిలో గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి. మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు. కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: “ఇకపై యాకోబు సిగ్గుపడడు; ఇకపై వారి ముఖాలు చిన్నబోవు. వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”