మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు. చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు. ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.” తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ. మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా? ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా? ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, చీకటిలో చిమ్మ చీకటిలో గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి. మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు. కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: “ఇకపై యాకోబు సిగ్గుపడడు; ఇకపై వారి ముఖాలు చిన్నబోవు. వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”
Read యెషయా 29
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 29:11-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు