యెషయా 26:1-11
యెషయా 26:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు– బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళముచేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరువారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మ్రింగివేయును.
యెషయా 26:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు. నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి. తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు. నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల! అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు. ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు. పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి. న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు. న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను. నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు. దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు. యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు. యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.
యెషయా 26:1-11 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు: యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది. మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి. తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు. ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు. యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు. నీయందు విశ్వాసముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు. కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి. నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి. అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు అది ధూళిలో పడిపోతుంది. అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు. మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు. మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు. కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది. ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది. దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు. చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే వాడు మంచి చేయటం నేర్చుకోడు. చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు. కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే వారు దానిని చూస్తారు. యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు. అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు. నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
యెషయా 26:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు. నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి. మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు. యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి. ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు. అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది. నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు. అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక. రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు. కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు. యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.