యెషయా 26:1-11

యెషయా 26:1-11 IRVTEL

ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు. నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి. తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకముంచాడు కాబట్టి నువ్వలా చేస్తావు. నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల! అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు. ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు. పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి. న్యాయవంతులు నడిచే దారి సమంగా ఉంటుంది. న్యాయ వంతుడా, నువ్వు న్యాయవంతులు దారిని తిన్నగా చేస్తావు. న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తుంది. నాలోని ఆత్మలో చిత్తశుద్ధితో నిన్ను వెతుకుతూ ఉన్నాను. నీ తీర్పులు భూమిపై తెలిసినప్పుడు ఈ లోక నివాసులు నీతిని అభ్యాసం చేస్తారు. దుర్మార్గుడికి నువ్వు దయ చూపినా వాడు మాత్రం నీ నీతిని నేర్చుకోడు. న్యాయబద్ధంగా జీవించే వారి మధ్యలో నివసించినా వాడు దుర్మార్గాన్నే అవలంబిస్తాడు. యెహోవా ఘనతా ప్రభావాలను వాడు పట్టించుకోడు. యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.

యెషయా 26:1-11 కోసం వీడియో