ఆదికాండము 42:18-38
ఆదికాండము 42:18-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని: మీరు నిజంగా యథార్థవంతులైతే, మీ సోదరులలో ఒకరిని ఇక్కడ చెరసాలలో ఉండనివ్వండి, మిగితా వారు ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ధాన్యం తీసుకెళ్లండి. అయితే మీ చిన్న తమ్మున్ని నా దగ్గరకు తీసుకురావాలి, అప్పుడు మీ మాటలు స్థిరపరచబడతాయి, మీరు చావరు” అని అన్నాడు. వారు అలానే చేశారు. అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు. రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు. యోసేపు దగ్గర భాషను తర్జుమా చేసేవాడు ఉన్నాడని అతడు వారి మాటలు అర్థం చేసుకోగలడని వారు గ్రహించలేదు. యోసేపు వారి దగ్గర నుండి వెళ్లి ఏడ్చి తిరిగివచ్చి వారితో మళ్ళీ మాట్లాడాడు. వారిలో నుండి షిమ్యోనును పట్టుకుని వారి కళ్లముందే బంధించాడు. యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు. వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు. రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు. “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు. వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు, “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు. అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము. “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి. కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకోవచ్చు’ అన్నాడు.” వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు. అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు. అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.
ఆదికాండము 42:18-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మూడవ రోజు యోసేపు వారిని చూసి “నేను దేవునికి భయపడే వాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి. మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి. మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు” అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు. అప్పుడు వారు ఒకడితో ఒకడు “మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనలను బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు.” రూబేను “ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది” అని వారితో అన్నాడు. వారి మాటలు యోసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు, ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు. యోసేపు వారి దగ్గరనుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరికి తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు. తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమనీ, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమనీ, ప్రయాణం కోసం భోజనపదార్ధాలు వారికివ్వాలనీ తన పనివారికి ఆజ్ఞాపించాడు. వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి. అప్పుడతడు “నా డబ్బు నాకే ఉంది. చూడండి, నా సంచిలోనే ఉంది” అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు “ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు?” అనుకున్నారు. వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు. “ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు. అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు. పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు’ అని అతనితో చెప్పాము. అందుకు ఆ దేశాధిపతి, మాతో ‘మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి. నా దగ్గరికి ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు’ అని చెప్పాడు” అన్నారు. వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు. అప్పుడు వారి తండ్రి యాకోబు “మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అని వారితో అన్నాడు. అందుకు రూబేను “నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను” అని చెప్పాడు. అయితే అతడు “నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు.
ఆదికాండము 42:18-38 పవిత్ర బైబిల్ (TERV)
మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.” ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు. అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు. యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు. కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు. కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం. “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైనవాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి. తర్వాత మీ చిన్న సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’” అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు. యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు, అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”
ఆదికాండము 42:18-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మూడవదినమున యోసేపు వారిని చూచి–నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు–నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒక నితో ఒకడు మాటలాడుకొనిరి. మరియు రూబేను – ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తర మిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్యనుండెను గనుక తమ మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు. అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యో నును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను. అప్పుడతడు–నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి–ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి. ఎట్లనగా–ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను. అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి–మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి, నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి– మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనిపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
ఆదికాండము 42:18-38 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)