ఆదికాండము 42:18-38
ఆదికాండము 42:18-38 TERV
మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.” ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు. అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు. యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు. కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు. కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం. “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైనవాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి. తర్వాత మీ చిన్న సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’” అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు. యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు, అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”

