ఆదికాండము 31:1-42
ఆదికాండము 31:1-42 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు. అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు. యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు. వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు. నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. ఒకవేళ అతడు, ‘పొడలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, మందలన్నీ పొడలు గల పిల్లలనే ఈనాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలనే ఈనాయి. ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. “మందలు చూలు కట్టే కాలంలో నాకొక కల వచ్చింది, అందులో మందతో వెళ్లిన మేకపోతులు చారలు, పొడలు లేదా మచ్చలతో ఉండడం నేను చూశాను. కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను. అతడు నాతో, ‘కళ్ళెత్తి చూడు, మందతో కూడుకుంటున్న మేకపోతులు పొడలు, మచ్చలు లేదా చారలతో ఉన్నాయి, ఎందుకంటే లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. నీవు ఎక్కడైతే ఒక స్తంభాన్ని అభిషేకించి నాకు మ్రొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు యొక్క దేవున్ని నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీ స్వదేశానికి వెళ్లు’ అని అన్నారు.” అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా? అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు. దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు. కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి, తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది. అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు. తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు. మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. లాబాను తన బంధువులను తీసుకుని, యాకోబును ఏడు రోజులు వెంటాడి గిలాదు కొండ సీమలో అతన్ని ఎదుర్కొన్నాడు. రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు. లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు. అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు. నీవెందుకు రహస్యంగా పారిపోయి, నన్ను మోసం చేశావు? మృదంగ సితారాల సంగీతంతో నిన్ను ఆనందంగా పంపేవాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు? నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు. నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు. సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?” యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను. అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు. లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు. రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు. రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు? నా సామానంతా వెదికావు కదా, నీ ఇంటికి సంబంధించింది నీకు ఏమి దొరికింది? నీ బంధువుల ఎదుట, మా వారి ఎదుట ఉంచు, వారు మన మధ్యలో తీర్పు తీర్చనివ్వు. “ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలకు, మేకలకు గర్భస్రావం కలుగలేదు లేదా నీ మందలోని పొట్టేళ్లను నేనేమి తినలేదు. అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు. నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది. నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు. ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”
ఆదికాండము 31:1-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లాబాను కొడుకులు “యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకుని, దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. అంతే గాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు. అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు. యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలునీ లేయానీ పిలిపించి వారితో, “ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు. అతడు, ‘పొడలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. ‘చారలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి. ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి. ఆ కలలో దేవుని దూత ‘యాకోబూ’ అని నన్ను పిలిచినప్పుడు నేను ‘చిత్తం, ప్రభూ’ అన్నాను. అప్పుడు ఆయన ‘నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను. నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి, మాకు రావలసిన సొమ్మంతటినీ పూర్తిగా తినేశాడు. దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి” అని అతనికి జవాబు చెప్పారు. యాకోబు తన కొడుకులనూ తన భార్యలనూ ఒంటెల మీద ఎక్కించి తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకు కనాను దేశానికి బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది. యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది. అతడు తనకు కలిగినదంతా తీసుకు పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు. యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకుని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి “నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా” అని అతనితో చెప్పాడు. చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో “ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు? నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే. నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు. నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, ‘జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు’ అని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి?” అన్నాడు. అందుకు యాకోబు “నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో” అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో “తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను” అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ “నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి? నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు. క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది. నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు” అని అన్నాడు.
ఆదికాండము 31:1-42 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్లు యాకోబు గమనించాడు. అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు. కనుక యాకోబు తన గొర్రెలు, మేకల మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు. రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు. నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు. “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి. కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. అలా కలుస్తున్న మగ మేకలు మాత్రమే మచ్చలు, చారలు గలవిగా నేను చూశాను. కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు. “‘చిత్తం’ అన్నాను నేను. “ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్లు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. క్రొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’” రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు ఆ తరువాత మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు. మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!” అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది. సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు. యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు. మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు. యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?” యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు. కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు. “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు. అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్లు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి కూడా నేను తినలేదు. ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను. పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.”
ఆదికాండము 31:1-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
లాబాను కుమారులు–మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు. అప్పుడు యెహోవా–నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. –మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు; మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు. అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత –యాకోబూ అని నన్ను పిలువగా–చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయు– యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికి ఉత్తరమియ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను. లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను. యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొనిపోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను. లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను. అప్పుడు లాబాను యాకోబుతో–నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొననియ్యక పిచ్చిపెట్టి యిట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుక కుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను. నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు –నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెనుగాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములోనుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను. రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో–తమ యెదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో–నీవిట్లు మండిపడి నన్ను తరుమ నేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయులమధ్య తీర్పు తీర్చుదురు. ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
ఆదికాండము 31:1-42 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)