ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్లు యాకోబు గమనించాడు. అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
కనుక యాకోబు తన గొర్రెలు, మేకల మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు. రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు. నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు.
“ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి. కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
“జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. అలా కలుస్తున్న మగ మేకలు మాత్రమే మచ్చలు, చారలు గలవిగా నేను చూశాను. కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు.
“‘చిత్తం’ అన్నాను నేను.
“ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్లు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. క్రొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’”
రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు ఆ తరువాత మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు. మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”
అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.
సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.
యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.
మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.
యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”
యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.
కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.
“నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.
అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్లు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి కూడా నేను తినలేదు. ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను. పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.”