లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు.
అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు.
యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు. వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు. నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. ఒకవేళ అతడు, ‘పొడలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, మందలన్నీ పొడలు గల పిల్లలనే ఈనాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలనే ఈనాయి. ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు.
“మందలు చూలు కట్టే కాలంలో నాకొక కల వచ్చింది, అందులో మందతో వెళ్లిన మేకపోతులు చారలు, పొడలు లేదా మచ్చలతో ఉండడం నేను చూశాను. కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను. అతడు నాతో, ‘కళ్ళెత్తి చూడు, మందతో కూడుకుంటున్న మేకపోతులు పొడలు, మచ్చలు లేదా చారలతో ఉన్నాయి, ఎందుకంటే లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. నీవు ఎక్కడైతే ఒక స్తంభాన్ని అభిషేకించి నాకు మ్రొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు యొక్క దేవున్ని నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీ స్వదేశానికి వెళ్లు’ అని అన్నారు.”
అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా? అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు. దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు.
కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి, తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు.
లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది. అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు. తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు.
మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. లాబాను తన బంధువులను తీసుకుని, యాకోబును ఏడు రోజులు వెంటాడి గిలాదు కొండ సీమలో అతన్ని ఎదుర్కొన్నాడు. రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు.
లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు. అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు. నీవెందుకు రహస్యంగా పారిపోయి, నన్ను మోసం చేశావు? మృదంగ సితారాల సంగీతంతో నిన్ను ఆనందంగా పంపేవాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు? నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు. నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు. సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?”
యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను. అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు.
లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు. రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు.
రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు.
యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు? నా సామానంతా వెదికావు కదా, నీ ఇంటికి సంబంధించింది నీకు ఏమి దొరికింది? నీ బంధువుల ఎదుట, మా వారి ఎదుట ఉంచు, వారు మన మధ్యలో తీర్పు తీర్చనివ్వు.
“ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలకు, మేకలకు గర్భస్రావం కలుగలేదు లేదా నీ మందలోని పొట్టేళ్లను నేనేమి తినలేదు. అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు. నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది. నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు. ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”