ఆదికాండము 2:7-18

ఆదికాండము 2:7-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:7-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది. మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:7-18 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి. ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు. మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.” అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:7-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు. యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి. ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది. ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది. ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుతుంది. మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు. ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు. యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు. యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.

షేర్ చేయి
Read ఆదికాండము 2