ఆది 2:7-18

ఆది 2:7-18 OTSA

యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు. యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి. ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది. ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది. ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుతుంది. మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు. ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు. యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు. యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.

Read ఆది 2

ఆది 2:7-18 కోసం వీడియో