ఆది 2:7-18

ఆది 2:7-18 IRVTEL

దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది. మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.

ఆది 2:7-18 కోసం వీడియో