గలతీయులకు 5:1-15

గలతీయులకు 5:1-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనలను స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి. నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు, అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని ప్రతి ఒక్కరితో మళ్ళీ నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు. నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే లెక్కించబడుతుంది. మీరు మంచి పరుగు పందాన్ని పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా అనుకోరని ప్రభువులో నేను నమ్మకం కలిగివున్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన మూల్యం చెల్లించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది. ఆ ప్రత్యర్థుల విషయానికొస్తే, నేను కోరేదేమిటంటే వారు తమకు తాముగా విడిపోవాలి! నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. “నీలాగే నీ పొరుగువారిని ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకొని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్త పడండి లేదా ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతారు.

షేర్ చేయి
Read గలతీయులకు 5

గలతీయులకు 5:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు. మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను. సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు. మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం. మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది. మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా? మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది. సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.

షేర్ చేయి
Read గలతీయులకు 5

గలతీయులకు 5:1-15 పవిత్ర బైబిల్ (TERV)

మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి. నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను. సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు. కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది. మీరు పందెంలో బాగా పరుగెత్తుచుంటిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు? మిమ్మల్ని పిలిచినవాడు ఆటంక పరచలేదు. “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు. మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు. నా సోదరులారా, సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది. నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి. “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది. మీరీ విధంగా కలహములాడుకొంటూ, హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి.

షేర్ చేయి
Read గలతీయులకు 5

గలతీయులకు 5:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతిమనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ధర్మశాస్త్ర మంతయు– నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి.

షేర్ చేయి
Read గలతీయులకు 5

గలతీయులకు 5:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి. నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని అందరితో మళ్ళీ నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు. నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురుచూస్తున్నాము. యేసు క్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే ప్రయోజనకరం అవుతుంది. మీరు బాగా పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు తమను తాము నరికివేసుకోవడం మంచిది! నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి. “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకుని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్తపడండి లేదా ఒకరి వలన ఒకరు నాశనం అవుతారు జాగ్రత్తపడండి.

షేర్ చేయి
Read గలతీయులకు 5

గలతీయులకు 5:1-15

గలతీయులకు 5:1-15 TELUBSIగలతీయులకు 5:1-15 TELUBSIగలతీయులకు 5:1-15 TELUBSI