గలతీయులకు 5
5
క్రీస్తులో స్వాతంత్ర్యం
1క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనలను స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి.
2నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు, అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. 3సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని ప్రతి ఒక్కరితో మళ్ళీ నేను చెప్తున్నాను. 4ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు. 5నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. 6యేసుక్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే లెక్కించబడుతుంది.
7మీరు మంచి పరుగు పందాన్ని పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? 8అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. 9“పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” 10మీరు మరోలా అనుకోరని ప్రభువులో నేను నమ్మకం కలిగివున్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన మూల్యం చెల్లించాలి. 11సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది. 12ఆ ప్రత్యర్థుల విషయానికొస్తే, నేను కోరేదేమిటంటే వారు తమకు తాముగా విడిపోవాలి!
ఆత్మ ద్వారా జీవితం
13నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. 14“నీలాగే నీ పొరుగువారిని ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది.#5:14 లేవీ 19:18 15ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకొని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్త పడండి లేదా ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతారు.
16కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. 17శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కనుక మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు. 18మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.
19శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము; 20విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరితమైన ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, 21మరియు ఓర్వలేనితనం, మత్తు, వెర్రి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.
22అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, 23మృదుత్వం, స్వీయ నియంత్రణ. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు. 24యేసుక్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో ఆశలతో సిలువ వేశారు. 25మనం ఆత్మ వలన జీవిస్తున్నాము కనుక మనం ఆత్మతో పాటు నడుద్దాము. 26ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా కావద్దు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
గలతీయులకు 5: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.