గలతీ పత్రిక 5:1-15

గలతీ పత్రిక 5:1-15 OTSA

క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి. నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని అందరితో మళ్ళీ నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు. నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురుచూస్తున్నాము. యేసు క్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే ప్రయోజనకరం అవుతుంది. మీరు బాగా పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు తమను తాము నరికివేసుకోవడం మంచిది! నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి. “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకుని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్తపడండి లేదా ఒకరి వలన ఒకరు నాశనం అవుతారు జాగ్రత్తపడండి.

Read గలతీ పత్రిక 5