యెహెజ్కేలు 37:1-9
యెహెజ్కేలు 37:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా చేయి నా మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ నన్ను తీసుకెళ్లి ఎముకలతో నిండిన ఒక లోయలో దించారు. ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి. “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను. ఆయన నాతో ఇలా అన్నారు, “ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి పంపిస్తాను. మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగా, గలగలమనే శబ్దం వినిపించి చూస్తే, ఆ ఎముకలన్నీ దగ్గరకు వచ్చి ఒక దానికి ఒకటి అంటుకున్నాయి. నేను చూస్తుండగా వాటి మీదికి కండరాలు మాంసం పొదగడం, వాటి మీద చర్మం కప్పుకోవడం కనిపించింది, అయితే వాటిలో ఊపిరి లేదు. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ”
యెహెజ్కేలు 37:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను. అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు. అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా”
యెహెజ్కేలు 37:1-9 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను. నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. “నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను. అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’” ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు. పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగి బ్రతుకుతాయి!’”
యెహెజ్కేలు 37:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.