యెహెజ్కేలు 37
37
ఎండిన ఎముకల లోయ
1యెహోవా చేయి నా మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ నన్ను తీసుకెళ్లి ఎముకలతో నిండిన ఒక లోయలో దించారు. 2ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి. 3“మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు.
అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను.
4ఆయన నాతో ఇలా అన్నారు, “ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. 5ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి#37:5 హెబ్రీలో ఈ పదానికి అర్థం గాలి లేదా ఆత్మ 6-14 వచనాలు కూడా చూడండి పంపిస్తాను. 6మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
7కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగా, గలగలమనే శబ్దం వినిపించి చూస్తే, ఆ ఎముకలన్నీ దగ్గరకు వచ్చి ఒక దానికి ఒకటి అంటుకున్నాయి. 8నేను చూస్తుండగా వాటి మీదికి కండరాలు మాంసం పొదగడం, వాటి మీద చర్మం కప్పుకోవడం కనిపించింది, అయితే వాటిలో ఊపిరి లేదు.
9అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ” 10కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే నేను ప్రవచించినప్పుడు ఊపిరి వారిలోనికి ప్రవేశించి వారు సజీవులై లేచి మహా సైన్యంగా నిలబడ్డారు.
11ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. వారు, ‘మా ఎముకలు ఎండిపోయాయి, మాకు ఏ ఆశ లేదు మేము నాశనమయ్యాం’ అని అనుకుంటున్నారు. 12కాబట్టి నీవు ప్రవచించి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా ప్రజలారా, నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను; ఇశ్రాయేలు దేశంలోకి మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను. 13నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు నా ప్రజలైన మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు. 14మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
ఒకే రాజు ఒకే దేశం
15యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 16“మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి. 17ఆ రెండింటిని నీ చేతిలో ఒకే కర్రలా ఉండేలా జతచేయి.
18“ ‘దీని భావమేమిటో మాకు చెప్పవా?’ అని నీ ప్రజలు నిన్ను అడిగినప్పుడు, 19వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో సంబంధం ఉన్న ఇశ్రాయేలీయుల గోత్రాలను తీసుకుని యూదా కర్రకు జతచేయబోతున్నాను. నేను వాటిని ఒకే కర్రలా చేస్తాను, అవి నా చేతిలో ఒకటిగా అవుతాయి.’ 20నీవు ఏ కర్రల మీదైతే వ్రాసావో వాటిని వారి కళ్లముందు పట్టుకుని, 21వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను. 22వారు ఇక ఎన్నటికీ రెండు జాతులుగా గాని రెండు రాజ్యాలుగా విడిపోకుండ నేను వారిని ఇశ్రాయేలు పర్వతాలమీద, ఒకే దేశంగా చేస్తాను. వారందరికి ఒకే రాజు ఉంటాడు. 23వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
24“ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు. 25నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు. 26నేను వారితో సమాధాన ఒప్పందాన్ని చేస్తాను; అది నాకు వారికి మధ్య శాశ్వత నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధాలయాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. 27నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు. 28వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 37: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.