యెహె 37

37
ఎండిన ఎముకల లోయ
1యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. 2ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. 3ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
4అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. 5ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. 6మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
7ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. 8నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
9అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా” 10ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
11అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు. 12కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.
13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే 14నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను#37:14 ఆత్మను ఊపిరిని మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
రెండు కర్రల ఉపమానం
15యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. 16నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి. 17అప్పుడు ఆ రెండూ నీ చేతిలో ఒక్కటయ్యేలా ఒక దానితో ఒకటి జోడించు.
18వీటి అర్థం ఏంటి? అని నీ ప్రజలు నిన్నడిగితే, వాళ్ళకిలా చెప్పు. 19యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిము చేతిలో ఉన్న కొమ్మ, అంటే ఏ కొమ్మ మీద ఇశ్రాయేలువారందరి పేర్లు, వాళ్ళ తోటివాళ్ళ పేర్లు, నేను ఉంచానో, ఆ యోసేపు అనే ఆ కొమ్మను యూదావాళ్ళ కొమ్మను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన కొమ్మగా చేస్తాను. 20ఆ రెండు కొమ్మలను వాళ్ళ ఎదుట నువ్వు చేతిలో పట్టుకో.
21వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను. 22వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. 23తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
24నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు. 25నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.
26నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. 27నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను. 28వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహె 37: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహె 37 కోసం వీడియో