నిర్గమకాండము 34:28-35
నిర్గమకాండము 34:28-35 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మోషే నలభై రాత్రింబవళ్ళు యెహోవాతో పాటు అక్కడే, ఆహారం తినకుండ నీళ్లు త్రాగకుండ ఉన్నాడు. అతడు నిబంధన మాటలు అనగా పది ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాశాడు. మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు. అహరోను, ఇశ్రాయేలీయులందరు మోషేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్లడానికి వారు భయపడ్డారు. అయితే మోషే వారిని పిలిచాడు; కాబట్టి అహరోను, సమాజ నాయకులు అతని దగ్గరకు తిరిగి వచ్చారు, అతడు వారితో మాట్లాడాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు. మోషే వారితో మాట్లాడడం ముగించినప్పుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు. అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.
నిర్గమకాండము 34:28-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు. మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు వచ్చారు. ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతణ్ణి సమీపించడానికి భయపడ్డారు. మోషే వాళ్ళను పిలిచాడు. అహరోను, సమాజంలోని పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడాడు. అ తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు. మోషే వాళ్ళతో ఆ విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. కానీ మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానం లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడల్లా యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖం చూసినప్పుడు అది కాంతిమయమై ప్రకాశిస్తూ ఉంది, మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేవరకూ తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు.
నిర్గమకాండము 34:28-35 పవిత్ర బైబిల్ (TERV)
నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు. అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు. మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి – యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుగును తీసే వాడుకాదు.
నిర్గమకాండము 34:28-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను. మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములుగల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాటలాడెను. అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
నిర్గమకాండము 34:28-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)