నిర్గమ 34:28-35

నిర్గమ 34:28-35 IRVTEL

మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు. మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు వచ్చారు. ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతణ్ణి సమీపించడానికి భయపడ్డారు. మోషే వాళ్ళను పిలిచాడు. అహరోను, సమాజంలోని పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడాడు. అ తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు. మోషే వాళ్ళతో ఆ విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. కానీ మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానం లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడల్లా యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖం చూసినప్పుడు అది కాంతిమయమై ప్రకాశిస్తూ ఉంది, మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేవరకూ తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు.

నిర్గమ 34:28-35 కోసం వీడియో