నిర్గమకాండము 34:28-35

నిర్గమకాండము 34:28-35 TERV

నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు. అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు. మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి – యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుగును తీసే వాడుకాదు.

నిర్గమకాండము 34:28-35 కోసం వీడియో