ఎస్తేరు 4:1-8

ఎస్తేరు 4:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి. ఎస్తేరుయొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై–మొర్దకై కట్టుకొని యున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించు కొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి–అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దకైయొద్దకు పోగా మొర్దకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకుగాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును అతనికి తెలిపి –వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.

షేర్ చేయి
Read ఎస్తేరు 4

ఎస్తేరు 4:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు. అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. రాజాజ్ఞ, శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో, రోదనతో ఉన్నారు. చాలా మంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు. ఎస్తేరు దాసీలు, ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించిందిగానీ అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది. హతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు. మొర్దెకై తనకు జరిగినదంతా అతనికి వివరించాడు. హామాను యూదులను నాశనం చేయడానికి రాజు ఖజానాకు తూచి ఇస్తానని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపాడు. ఎస్తేరుకు చూపించడం కోసం యూదుల ఊచకోతకై షూషనులో విడుదల చేసిన ఆజ్ఞ ప్రతిని కూడా అతనికి ఇచ్చాడు. ఆమె తన జాతి ప్రజల పక్షంగా రాజు సముఖానికి వెళ్లి అతనికి విజ్ఞప్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు.

షేర్ చేయి
Read ఎస్తేరు 4

ఎస్తేరు 4:1-8 పవిత్ర బైబిల్ (TERV)

మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు. ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు. అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హతమార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు. యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించమనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమనీ అతను హతాకుకి చెప్పాడు.

షేర్ చేయి
Read ఎస్తేరు 4

ఎస్తేరు 4:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మొర్దెకై జరిగిందంతా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని వేదనతో గట్టిగా ఏడుస్తూ పట్టణంలోనికి వెళ్లాడు. అయితే అతడు రాజభవన ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, ఎందుకంటే గోనెపట్ట కట్టుకున్న వారెవరికి భవనం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు. రాజు శాసనం, ఆదేశం వెళ్లిన ప్రతి సంస్థానంలో ఉన్న యూదులంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ వేదనతో తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉన్నారు. ఎస్తేరు రాణి యొక్క నపుంసకులు, చెలికత్తెలు వచ్చి మొర్దెకై గురించి చెప్పినప్పుడు ఆమె తీవ్ర వేదనకు గురైంది. గోనెపట్ట తీసివేయమని చెప్పి కట్టుకోవడానికి అతనికి బట్టలు పంపించింది, కాని అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు, మొర్దెకైను అంత బాధ పెడుతున్న విషయం ఏమిటో తెలుసుకోమని రాజు ఆమె కోసం నియమించిన నపుంసకులలో హతాకు అనే అతన్ని పంపింది. కాబట్టి హతాకు రాజభవన ద్వారం ఎదురుగా నగర వీధిలో ఉన్న మొర్దెకై దగ్గరకు వెళ్లాడు. మొర్దెకై తనకు జరిగిందంతా చెప్పాడు, యూదులను నాశనం చేయడానికి హామాను రాజు ఖజానాకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఎంతో అతనికి తెలిపాడు. తమను నిర్మూలం చేయమని షూషనులో ప్రకటించిన శాసనం యొక్క నకలు కూడా అతనికి ఇచ్చి దానిని ఎస్తేరుకు చూపించి వివరించమని చెప్పాడు; ఆమె రాజు సముఖానికి వెళ్లి తన ప్రజల పట్ల దయ చూపించేలా రాజును వేడుకోమని చెప్పమని మొర్దెకై అతనితో చెప్పాడు.

షేర్ చేయి
Read ఎస్తేరు 4