ఎస్తేరు 4:1-8

ఎస్తేరు 4:1-8 IRVTEL

జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు. అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. రాజాజ్ఞ, శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో, రోదనతో ఉన్నారు. చాలా మంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు. ఎస్తేరు దాసీలు, ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించిందిగానీ అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది. హతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు. మొర్దెకై తనకు జరిగినదంతా అతనికి వివరించాడు. హామాను యూదులను నాశనం చేయడానికి రాజు ఖజానాకు తూచి ఇస్తానని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపాడు. ఎస్తేరుకు చూపించడం కోసం యూదుల ఊచకోతకై షూషనులో విడుదల చేసిన ఆజ్ఞ ప్రతిని కూడా అతనికి ఇచ్చాడు. ఆమె తన జాతి ప్రజల పక్షంగా రాజు సముఖానికి వెళ్లి అతనికి విజ్ఞప్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు.