ఎస్తేరు 4:1-8

ఎస్తేరు 4:1-8 TERV

మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు. ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు. అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హతమార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు. యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించమనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమనీ అతను హతాకుకి చెప్పాడు.

Read ఎస్తేరు 4