ద్వితీయోపదేశకాండము 28:15-68
ద్వితీయోపదేశకాండము 28:15-68 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి. మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు. మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి. మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి. మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు. మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు. మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు. యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది. మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి. యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది. మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది. మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు. యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు. యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు. మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు. మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు. మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు. మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు. మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు. మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి. యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి. మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు. యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు. మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు. మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి. మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి. మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు. మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి. మీ మధ్య నివసించే విదేశీయులు మీకంటే అంతకంతకు పైకి ఎదుగుతారు, కానీ మీరు అంతకంతకు దిగజారిపోతారు. వారు మీకు అప్పిస్తారు గాని, మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు. ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనమయ్యే వరకు వారు మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని అధిగమిస్తారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపలేదు, ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించలేదు. అవి మీకు, మీ వారసులకు ఎప్పటికీ సూచనలుగా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. ఎందుకంటే మీరు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీ దేవుడైన యెహోవాకు సంతోషంగా, ఆనందంగా సేవ చేయలేదు. అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు. అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము. మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు. మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు. ముట్టడి సమయంలో మీ శత్రువు మీకు కలిగించే బాధల కారణంగా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన గర్భఫలం, కుమారులు కుమార్తెల మాంసాన్ని మీరు తింటారు. మీలో అత్యంత సౌమ్యుడైన, సున్నితమైన పురుషునికి కూడా తన సొంత సోదరునిపై గాని లేదా తాను ప్రేమించే భార్యపై గాని లేదా మిగిలి ఉన్న పిల్లలపై గాని కనికరం ఉండదు. అతడు తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా అతడు వారికి ఇవ్వడు. ఎందుకంటే మీ పట్టణాలన్ని ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మీకు కలిగించిన బాధను బట్టి అతనికి మిగిలింది అదే. మీలో అత్యంత సౌమ్యమైన సున్నితమైన స్త్రీ తన పాదం కూడా నేలమీద మోపే సాహసం చేయని స్త్రీ తాను ప్రేమించిన భర్తను, తన సొంత కుమారుడు లేదా కుమార్తెను వేధిస్తుంది. మీ పట్టణాలు ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మిమ్మల్ని పెట్టే బాధను బట్టి ఆమె వేరే దారి లేక ఆమె గర్భం నుండి స్రవించే మావిని, కనిన పిల్లలను రహస్యంగా తినాలని అనుకుంటుంది. ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే, యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు. మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు. ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు. అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు. ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు. మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు. ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు. మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.
ద్వితీయోపదేశకాండము 28:15-68 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి. పొలంలో మీకు శాపాలు ఉంటాయి. మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి. మీ గర్భఫలం, మీ భూపంట, మీ పశువుల మందల మీద శాపాలు ఉంటాయి. మీరు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు శాపాలు ఉంటాయి. మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా మీరు నాశనమయ్యే వరకూ తెగులు మీకు అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు. యెహోవా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి. మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది. యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది. యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు. నీ శవం అన్ని రకాల పక్షులకూ, క్రూర మృగాలకూ ఆహారమవుతుంది. వాటిని బెదిరించే వాడెవడూ ఉండడు. యెహోవా ఐగుప్తు కురుపులతో, పుండ్లతో, చర్మవ్యాధులతో, దురదతో మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని బాగుచేసుకోలేరు. పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు. ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ది చెందరు. ఇతరులు మిమ్మల్ని అణిచివేస్తారు, దోచు కుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. ఒక కన్యను నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు కానీ దానిలో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు కానీ దాని పండ్లు తినరు. మీ కళ్ళముందే మీ ఎద్దును కోస్తారు కానీ దాని మాంసాన్ని మీరు తినరు. మీ దగ్గర నుంచి మీ గాడిదను బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. దాన్ని తిరిగి మీకు ఇవ్వరు. మీ గొర్రెలను మీ విరోధులకు ఇస్తారు కానీ మీకు సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు. మీ కొడుకులను, కూతుళ్ళను అన్య జనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురు చూస్తూ అలిసిపోతాయి గానీ మీ వల్ల ఏమీ జరగదు. మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి, అణచి ఉంచుతారు. మీ కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది. యెహోవా నీ అరకాలి నుంచి నడినెత్తి వరకూ మోకాళ్ల మీదా తొడల మీదా మానని కఠినమైన పుండ్లు పుట్టించి మిమ్మల్ని బాధిస్తాడు. యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు. యెహోవా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు. ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి. ద్రాక్షతోటలను మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి. మీ ప్రాంతమంతా ఒలీవ చెట్లు ఉంటాయి కానీ ఆ నూనె తలకు రాసుకోరు. ఎందుకంటే మీ ఒలీవ కాయలు రాలిపోతాయి. కొడుకులనూ కూతుర్లనూ కంటారు కానీ వారు మీదగ్గర ఉండరు. వారు బందీలుగా వెళ్లితారు. మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి. మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మీరు అంతకంతకూ కిందిస్థాయికి దిగజారతారు. అతడు మీకు అప్పిస్తాడు గానీ మీరు అతనికి అప్పివ్వలేరు. అతడు తలగా ఉంటాడు, మీరు తోకగా ఉంటారు. మీరు నాశనమయ్యేవరకూ ఈ శిక్షలన్నీ మీ మీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. ఎందుకంటే మీ యెహోవా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలనూ, ఆయన చట్టాలనూ అనుసరించి నడుచుకొనేలా మీరు ఆయన మాట వినలేదు. అవి ఎప్పటికీ మీ మీద, మీ సంతానం మీద సూచనలుగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను ఆరాధించలేదు. కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ యెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు. దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు. వాళ్ళు క్రూరత్వం నిండినవారై ముసలివాళ్ళను, పసి పిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకూ మీ పశువులనూ మీ పొలాల పంటనూ దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకూ మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రె మేకమందలు మీకు మిగలకుండా చేస్తారు. మీరు ఆశ్రయించే ఎత్తయిన కోట గోడలు కూలిపోయే వరకూ మీ దేశమంతా మీ పట్టణ ద్వారాల దగ్గర వారు మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ దేశమంతటిలో మీ పట్టణ గుమ్మాల దగ్గర మిమ్మల్ని ముట్టడిస్తారు. ఆ ముట్టడిలో మీ శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తాళలేక మీ సంతానాన్ని, అంటే మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మీ కొడుకులను, కూతుళ్ళను చంపి, వాళ్ళ మాంసం మీరు తింటారు. మీలో మృదు స్వభావి, సుకుమారత్వం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల మాంసాన్ని తింటాడు. వాటిలో కొంచెమైనా తన సోదరునికి గానీ, తన ప్రియమైన భార్యకుగానీ, తన మిగతా పిల్లలకు గానీ మిగల్చడు. వాళ్ళపై జాలి చూపడు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో ముట్టడిలో అతనికేమీ మిగలదు. మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు. వారిపట్ల దయ చూపించదు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిని ముట్టడించి మిమ్మల్ని దోచుకోవడం వల్ల, కడుపు నింపుకోవడానికి మీకేమీ మిగలదు. ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక, మీ యెహోవా దేవుని ఘనమైన నామానికి, భయభక్తులు కనపరచకపోతే యెహోవా మీకూ మీ సంతానానికీ దీర్ఘకాలం ఉండే, మానని భయంకరమైన రోగాలు, తెగుళ్ళు రప్పిస్తాడు. మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీమీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు. మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు. మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు. మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు. యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు. ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవా చేస్తాడు. చస్తామో, బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలూ రాత్రి భయం భయంగా గడుపుతారు. రాత్రింబవళ్ళూ భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనీ, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు. మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలోగుండా యెహోవా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు కానీ మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు.”
ద్వితీయోపదేశకాండము 28:15-68 పవిత్ర బైబిల్ (TERV)
“అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి: “మీ పట్టణాల్ని, పొలాల్ని యెహోవా శపిస్తాడు. మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు. యెహోవా మిమ్మల్ని శపిస్తాడు, మీకు అనేక మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని శపిస్తాడు, గనుక మంచి పంటను మీరు పొందరు. ఆయన మీ పశువులను శపిస్తాడు, గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు. ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు. మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు. “మీరు కీడు చేసి, యెహోవాకు దూరమైతే, మీకు చెడు సంగతులు సంభవించేటట్టు ఆయన చేస్తాడు. మీరు చేసే ప్రతిదానిలో మీకు విసుగు, కష్టం కలుగుతుంది. మీరు త్వరగా, పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయననుంచి దూరమై, ఆయనను విసర్జించారు. మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, మీరు నివసించేందుకని ప్రవేశిస్తున్న దేశంలో, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటంతవరకు మీకు రోగాలు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు భయంకర వేడి కలిగిస్తాడు, భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి. మీకు పైగా ఆకాశం ఇత్తడిలా తేటగా ఉంటుంది. మీ క్రింద భూమి ఇనుములా గట్టిగా ఉంటుంది. ఆకాశంనుంచి వర్షానికి బదులు ఇసుక, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు అది మీ మీదికి వస్తుంది. “మీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు మీ శత్రువులమీదకు వెళ్లి, వారి దగ్గర్నుండి ఏడు వేర్వేరు మార్గాలలో మీరు పారిపోతారు. మీకు సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని ప్రజలంతా భయపడతారు. మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం అవుతాయి. మీ శవాల మీదనుండి వాటిని వెళ్లగొట్టే వారు ఎవరూ ఉండరు. “మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఈజిప్టు వాళ్లమీదికి పంపిన గడ్డల్లాంటి వాటితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. పుండ్లు. కుష్ఠు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. మీకు పిచ్చి ఎక్కేట్టుగా చేసి యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసి, కలవరపరుస్తాడు. అప్పుడు గుడ్డివారు తడువులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతావు. మీరు చేసే ప్రతిదానిలో మీకు మీరు విఫలులవుతారు. ప్రజలు మరల మరల మిమ్మల్ని బాధించి, మీ దగ్గర్నుండి వస్తువులు దొంగిలిస్తారు. మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు. “నీకు ప్రధానం చేయబడిన స్త్రీతో మరొకడు లైగింక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు కడతావు గాని అందులో నీవు నివసించవు. ద్రాక్షతోట నీవు నాటుతావు గాని దానిలో నీవు ఏమీ కూర్చుకోవు. నీ ఆవు నీ కళ్లముందే చంపబడుతుంది గాని నీవు దాని మాంసం ఏమీ తినవు. నీ గాడిద నీ దగ్గర్నుండి బలాత్కారంగా తీసుకొని పోబడుతుంది. అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ గొర్రెలు నీ శత్రువులకు ఇవ్వబడుతాయి. నిన్ను రక్షించేవాడు ఎవడూ ఉండడు. “మీ కొడుకులు, కూతుళ్లు వేరే జాతి ప్రజలకు ఇవ్వబడేందుకు అనుమతించబడతారు. మీ పిల్లలు మీకు కావాలి గనుక మీ కళ్లు బలహీనమై, మీ చూపు మందగించేటంతవరకు మీరు వాళ్లకోసం చూస్తారు. మరియు దేవుడు మీకు సహాయం చేయడు. “మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు మిమ్మల్ని చూచి, చెడుగా తిడతారు. విరుగగొట్టబడుతుంటారు. మీరు చూసే విషయాల మూలంగా మీకు పిచ్చెక్కుతుంది. యెహోవా మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షిస్తాడు. ఈ పుండ్లు మీ కాళ్ల మీద, మోకాళ్లమీద ఉంటాయి. అవి మీ అరికాలు మొదలుకొని మీ నడి నెత్తివరకు నిండి ఉంటాయి. ఈ పుండ్లనుండి మీరు బాగుపడరు. “మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్క, రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను అక్కడ మీరు పూజిస్తారు. యెహోవా మిమ్మల్ని పంపించే దేశాల్లో, మీకు సంభవించిన సంగతులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు. “పొలాల్లో చల్లటానికి మీరు విస్తారంగా విత్తనాలు తీసుకొని వెళ్తారు. కానీ మీ పంట కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మిడతలు మీ పంటను తినివేస్తాయి. మీరు ద్రాక్ష తోటలు నాటి, వాటిలో కష్టపడి పని చేస్తారు. కానీ మీరు ద్రాక్ష పండ్లు కూర్చుకోరు, వాటి రసం తాగలేరు. ఎందుకంటే పురుగులు వాటిని తినివేస్తాయి. మీ దేశమంతటా మీకు ఒలీవ చెట్లు ఉంటాయి. కాని ఉపయోగించు కొనేందుకు మీకు ఎలాంటి నూనె ఉండదు. ఎందుచేతనంటే మీ ఒలీవ పండ్లు పాడై రాలిపోతాయి. మీకు కుమారులు, కుమారైలు ఉంటారు. కాని వారిని మీరు ఉంచుకోలేరు. ఎందుచేతనంటే వారు బంధించబడి తీసుకొని పోబడతారు. మీ చెట్లన్నింటినీ, మీ పోలాల్లోని పంటలన్నింటినీ మిడతలు నాశనం చేస్తాయి. మీ మధ్య నివసించే విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందుతారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టుకొంటారు. మీకు అప్పు ఇచ్చేందుకు విదేశీయుల దగ్గర ధనం ఉంటుంది. కానీ వారికి అప్పు ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ ధనం ఉండదు. శిరస్సు దేహాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నట్టు వారు మిమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొంటారు. మీరు తోకలా ఉంటారు. “ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టుకొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. ఆయన మీకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు విధేయులు కాలేదు. మీకు, మీ సంతతివారికి దేవుడు శాశ్వతంగా తీర్పుతీర్చాడని ఈ శాపాలు ప్రజలకు తెలియజేస్తాయి. మీకు సంభవించే భయంకర విషయాలను చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోతారు. “మీ దేవుడైన యెహోవా మీకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మీరు సంతోషంగా, ఆనంద హృదయంతో ఆయనను సేవించలేదు. అందుచేత శత్రువులకు మీరు సేవచేస్తారు. ఆకలి, దాహంతో మీరు దిగంబరులుగా ఉంటారు. మీకు ఏమీ ఉండదు. యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతవరకు ఆయన మీ మెడమీద ఇనుప కాడిని పెడతాడు. “దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది. ఈ రాజ్యం వారి ముఖాలు కఠినంగా ఉంటాయి. వారు ముసలి వాళ్లను లేక్కచేయరు. చిన్నపిల్లల మీద వాళ్లు దయచూపించరు. మీరు నాశనం అయ్యేంతవరకు మీ పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను వారు తింటారు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం వారు విడిచిపెట్టరు. మీరు నాశనం అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉంటారు. “ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టుముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది. శత్రువు మీ పట్టణం చుట్టూ కనిపెట్టుకొని వుండగా, మీరు ఎంతో శ్రమ అనుభవిస్తారు. మీరు ఆకలి భరించలేక మీ పిల్లల్నే తినివేస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కుమారులు, కుమార్తెల శరీరాలను మీరు తింటారు. “మీలో దయగల అతి మర్యాదస్తుడు కూడా క్రూరుడవుతాడు. ఇతరులతో కూడా క్రూరంగా వుంటాడు. తాను ప్రేమించే భార్యతోగాని, ఇంకను బతికున్న తన పిల్లలతోగాని క్రూరుడై భాగం పంచుకొనేందుకు ఆతడు ఒప్పుకోడు. మీ పట్టణాల మీద దాడి చేసేందుకు వచ్చే శత్రువు అంత తీవ్ర నష్టం కలిగిస్తాడు. గనుక ఆతనికి తినటానికి కూడా ఏమీ మిగులదు. అందుచేత అతడు తన స్వంత పిల్లల్నే కొందర్ని తినివేస్తాడు. కాని తన కుటుంబంలో ఇంకెవ్వరికీ అతడు ఏమీ ఇవ్వడు. “ఎన్నడూ నేలమీద కాలు మోపనంత సున్నితమైన ధనికురాలు, మీలో ఎంతో గొప్ప దయ, మర్యాద గల స్త్రీ కూడా కఠినంగా ఉండి అలానే చేస్తుంది. ఆమె తన స్వంత ప్రియ భర్తతో లేక తన స్వంత కుమారునితో, స్వంత కుమార్తెతో భాగం పంచుకొనేందుకు నిరాకరిస్తుంది. ఆమె తన మాయని, తాను కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమ కలిగించినపుడు ఇలా జరుగుతుంది. “ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు. మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదికి రప్పిస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని, ప్రతి కష్టాన్నియెహోవా మీ మీదికి రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు. మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక. “ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు. భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు. “ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు. మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు. ‘ఇది సాయంత్రం అయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల. యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”
ద్వితీయోపదేశకాండము 28:15-68 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకికాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్ఠుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును, స్త్రీని ప్రధానము చేసికొందువుగాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు. యెహోవా దూరమైయున్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరివచ్చునట్లు నీమీదికి రప్పిం చును. నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునేగాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమా ర్తెలయొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలుచేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున–అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున–అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను మీ శత్రువులకు మిమ్మును మీరు అమ్మ జూపు కొందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
ద్వితీయోపదేశకాండము 28:15-68 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)