ద్వితీయో 28:15-68

ద్వితీయో 28:15-68 OTSA

అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి. మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు. మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి. మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి. మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు. మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు. మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు. యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది. మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి. యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది. మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది. మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు. యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు. యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు. మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు. మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు. మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు. మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు. మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు. మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి. యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి. మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు. యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు. మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు. మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి. మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి. మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు. మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి. మీ మధ్య నివసించే విదేశీయులు మీకంటే అంతకంతకు పైకి ఎదుగుతారు, కానీ మీరు అంతకంతకు దిగజారిపోతారు. వారు మీకు అప్పిస్తారు గాని, మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు. ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనమయ్యే వరకు వారు మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని అధిగమిస్తారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపలేదు, ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించలేదు. అవి మీకు, మీ వారసులకు ఎప్పటికీ సూచనలుగా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. ఎందుకంటే మీరు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీ దేవుడైన యెహోవాకు సంతోషంగా, ఆనందంగా సేవ చేయలేదు. అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు. అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము. మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు. మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు. ముట్టడి సమయంలో మీ శత్రువు మీకు కలిగించే బాధల కారణంగా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన గర్భఫలం, కుమారులు కుమార్తెల మాంసాన్ని మీరు తింటారు. మీలో అత్యంత సౌమ్యుడైన, సున్నితమైన పురుషునికి కూడా తన సొంత సోదరునిపై గాని లేదా తాను ప్రేమించే భార్యపై గాని లేదా మిగిలి ఉన్న పిల్లలపై గాని కనికరం ఉండదు. అతడు తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా అతడు వారికి ఇవ్వడు. ఎందుకంటే మీ పట్టణాలన్ని ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మీకు కలిగించిన బాధను బట్టి అతనికి మిగిలింది అదే. మీలో అత్యంత సౌమ్యమైన సున్నితమైన స్త్రీ తన పాదం కూడా నేలమీద మోపే సాహసం చేయని స్త్రీ తాను ప్రేమించిన భర్తను, తన సొంత కుమారుడు లేదా కుమార్తెను వేధిస్తుంది. మీ పట్టణాలు ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మిమ్మల్ని పెట్టే బాధను బట్టి ఆమె వేరే దారి లేక ఆమె గర్భం నుండి స్రవించే మావిని, కనిన పిల్లలను రహస్యంగా తినాలని అనుకుంటుంది. ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే, యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు. మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు. ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు. అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు. ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు. మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు. ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు. మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.