“అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి:
“మీ పట్టణాల్ని,
పొలాల్ని యెహోవా శపిస్తాడు.
మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు.
మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.
యెహోవా మిమ్మల్ని శపిస్తాడు,
మీకు అనేక మంది పిల్లలు కలగరు.
ఆయన మీ భూమిని శపిస్తాడు,
గనుక మంచి పంటను మీరు పొందరు.
ఆయన మీ పశువులను శపిస్తాడు,
గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు.
ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు.
మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు.
“మీరు కీడు చేసి, యెహోవాకు దూరమైతే, మీకు చెడు సంగతులు సంభవించేటట్టు ఆయన చేస్తాడు. మీరు చేసే ప్రతిదానిలో మీకు విసుగు, కష్టం కలుగుతుంది. మీరు త్వరగా, పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయననుంచి దూరమై, ఆయనను విసర్జించారు. మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, మీరు నివసించేందుకని ప్రవేశిస్తున్న దేశంలో, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటంతవరకు మీకు రోగాలు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు భయంకర వేడి కలిగిస్తాడు, భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి. మీకు పైగా ఆకాశం ఇత్తడిలా తేటగా ఉంటుంది. మీ క్రింద భూమి ఇనుములా గట్టిగా ఉంటుంది. ఆకాశంనుంచి వర్షానికి బదులు ఇసుక, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు అది మీ మీదికి వస్తుంది.
“మీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు మీ శత్రువులమీదకు వెళ్లి, వారి దగ్గర్నుండి ఏడు వేర్వేరు మార్గాలలో మీరు పారిపోతారు. మీకు సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని ప్రజలంతా భయపడతారు. మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం అవుతాయి. మీ శవాల మీదనుండి వాటిని వెళ్లగొట్టే వారు ఎవరూ ఉండరు.
“మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఈజిప్టు వాళ్లమీదికి పంపిన గడ్డల్లాంటి వాటితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. పుండ్లు. కుష్ఠు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. మీకు పిచ్చి ఎక్కేట్టుగా చేసి యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసి, కలవరపరుస్తాడు. అప్పుడు గుడ్డివారు తడువులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతావు. మీరు చేసే ప్రతిదానిలో మీకు మీరు విఫలులవుతారు. ప్రజలు మరల మరల మిమ్మల్ని బాధించి, మీ దగ్గర్నుండి వస్తువులు దొంగిలిస్తారు. మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు.
“నీకు ప్రధానం చేయబడిన స్త్రీతో మరొకడు లైగింక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు కడతావు గాని అందులో నీవు నివసించవు. ద్రాక్షతోట నీవు నాటుతావు గాని దానిలో నీవు ఏమీ కూర్చుకోవు. నీ ఆవు నీ కళ్లముందే చంపబడుతుంది గాని నీవు దాని మాంసం ఏమీ తినవు. నీ గాడిద నీ దగ్గర్నుండి బలాత్కారంగా తీసుకొని పోబడుతుంది. అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ గొర్రెలు నీ శత్రువులకు ఇవ్వబడుతాయి. నిన్ను రక్షించేవాడు ఎవడూ ఉండడు.
“మీ కొడుకులు, కూతుళ్లు వేరే జాతి ప్రజలకు ఇవ్వబడేందుకు అనుమతించబడతారు. మీ పిల్లలు మీకు కావాలి గనుక మీ కళ్లు బలహీనమై, మీ చూపు మందగించేటంతవరకు మీరు వాళ్లకోసం చూస్తారు. మరియు దేవుడు మీకు సహాయం చేయడు.
“మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు మిమ్మల్ని చూచి, చెడుగా తిడతారు. విరుగగొట్టబడుతుంటారు. మీరు చూసే విషయాల మూలంగా మీకు పిచ్చెక్కుతుంది. యెహోవా మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షిస్తాడు. ఈ పుండ్లు మీ కాళ్ల మీద, మోకాళ్లమీద ఉంటాయి. అవి మీ అరికాలు మొదలుకొని మీ నడి నెత్తివరకు నిండి ఉంటాయి. ఈ పుండ్లనుండి మీరు బాగుపడరు.
“మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్క, రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను అక్కడ మీరు పూజిస్తారు. యెహోవా మిమ్మల్ని పంపించే దేశాల్లో, మీకు సంభవించిన సంగతులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
“పొలాల్లో చల్లటానికి మీరు విస్తారంగా విత్తనాలు తీసుకొని వెళ్తారు. కానీ మీ పంట కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మిడతలు మీ పంటను తినివేస్తాయి. మీరు ద్రాక్ష తోటలు నాటి, వాటిలో కష్టపడి పని చేస్తారు. కానీ మీరు ద్రాక్ష పండ్లు కూర్చుకోరు, వాటి రసం తాగలేరు. ఎందుకంటే పురుగులు వాటిని తినివేస్తాయి. మీ దేశమంతటా మీకు ఒలీవ చెట్లు ఉంటాయి. కాని ఉపయోగించు కొనేందుకు మీకు ఎలాంటి నూనె ఉండదు. ఎందుచేతనంటే మీ ఒలీవ పండ్లు పాడై రాలిపోతాయి. మీకు కుమారులు, కుమారైలు ఉంటారు. కాని వారిని మీరు ఉంచుకోలేరు. ఎందుచేతనంటే వారు బంధించబడి తీసుకొని పోబడతారు. మీ చెట్లన్నింటినీ, మీ పోలాల్లోని పంటలన్నింటినీ మిడతలు నాశనం చేస్తాయి. మీ మధ్య నివసించే విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందుతారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టుకొంటారు. మీకు అప్పు ఇచ్చేందుకు విదేశీయుల దగ్గర ధనం ఉంటుంది. కానీ వారికి అప్పు ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ ధనం ఉండదు. శిరస్సు దేహాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నట్టు వారు మిమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొంటారు. మీరు తోకలా ఉంటారు.
“ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టుకొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. ఆయన మీకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు విధేయులు కాలేదు. మీకు, మీ సంతతివారికి దేవుడు శాశ్వతంగా తీర్పుతీర్చాడని ఈ శాపాలు ప్రజలకు తెలియజేస్తాయి. మీకు సంభవించే భయంకర విషయాలను చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోతారు.
“మీ దేవుడైన యెహోవా మీకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మీరు సంతోషంగా, ఆనంద హృదయంతో ఆయనను సేవించలేదు. అందుచేత శత్రువులకు మీరు సేవచేస్తారు. ఆకలి, దాహంతో మీరు దిగంబరులుగా ఉంటారు. మీకు ఏమీ ఉండదు. యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతవరకు ఆయన మీ మెడమీద ఇనుప కాడిని పెడతాడు.
“దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది. ఈ రాజ్యం వారి ముఖాలు కఠినంగా ఉంటాయి. వారు ముసలి వాళ్లను లేక్కచేయరు. చిన్నపిల్లల మీద వాళ్లు దయచూపించరు. మీరు నాశనం అయ్యేంతవరకు మీ పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను వారు తింటారు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం వారు విడిచిపెట్టరు. మీరు నాశనం అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉంటారు.
“ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టుముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది. శత్రువు మీ పట్టణం చుట్టూ కనిపెట్టుకొని వుండగా, మీరు ఎంతో శ్రమ అనుభవిస్తారు. మీరు ఆకలి భరించలేక మీ పిల్లల్నే తినివేస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కుమారులు, కుమార్తెల శరీరాలను మీరు తింటారు.
“మీలో దయగల అతి మర్యాదస్తుడు కూడా క్రూరుడవుతాడు. ఇతరులతో కూడా క్రూరంగా వుంటాడు. తాను ప్రేమించే భార్యతోగాని, ఇంకను బతికున్న తన పిల్లలతోగాని క్రూరుడై భాగం పంచుకొనేందుకు ఆతడు ఒప్పుకోడు. మీ పట్టణాల మీద దాడి చేసేందుకు వచ్చే శత్రువు అంత తీవ్ర నష్టం కలిగిస్తాడు. గనుక ఆతనికి తినటానికి కూడా ఏమీ మిగులదు. అందుచేత అతడు తన స్వంత పిల్లల్నే కొందర్ని తినివేస్తాడు. కాని తన కుటుంబంలో ఇంకెవ్వరికీ అతడు ఏమీ ఇవ్వడు.
“ఎన్నడూ నేలమీద కాలు మోపనంత సున్నితమైన ధనికురాలు, మీలో ఎంతో గొప్ప దయ, మర్యాద గల స్త్రీ కూడా కఠినంగా ఉండి అలానే చేస్తుంది. ఆమె తన స్వంత ప్రియ భర్తతో లేక తన స్వంత కుమారునితో, స్వంత కుమార్తెతో భాగం పంచుకొనేందుకు నిరాకరిస్తుంది. ఆమె తన మాయని, తాను కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమ కలిగించినపుడు ఇలా జరుగుతుంది.
“ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు. మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదికి రప్పిస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని, ప్రతి కష్టాన్నియెహోవా మీ మీదికి రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు. మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక.
“ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు. భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు.
“ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు. మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు. ‘ఇది సాయంత్రం అయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల. యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”