దానియేలు 6:4-10
దానియేలు 6:4-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు. అప్పుడు ఆ ప్రధానమంత్రులు, అధికారులు రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. వాళ్ళు రాజుతో ఇలా చెప్పారు. “రాజువైన దర్యావేషూ, నువ్వు చిరకాలం జీవిస్తావు గాక. ఈ దేశంలోని పాలకులు, ప్రముఖులు, అధికారులు, మంత్రులు, సంస్థానాల అధిపతులు అందరూ సమావేశమై రాజు కోసం ఒక కచ్చితమైన చట్టం సిద్ధం చేసి దాన్ని రాజు ఆజ్ఞగా చాటించాలని ఆలోచన చేశారు. అది ఏమిటంటే దేశంలోని ప్రజల్లో ఎవ్వరూ 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ ఇతర దేవునికీ, ఏ ఇతర మనిషికీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలి. అందువల్ల రాజా, ఈ ప్రకారంగా రాయించి రాజ శాసనం సిద్ధం చేయండి. మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు. అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు. ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.
దానియేలు 6:4-10 పవిత్ర బైబిల్ (TERV)
కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యాధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొనలేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజును మోసగించలేదు. కష్టించి పని చేసాడు. చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు. అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి. ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసివేయబడతాడు. రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి, ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు. అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు. దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.
దానియేలు 6:4-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు–అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి–రాజగు దర్యా వేషూ, చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి నను సరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేముతట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
దానియేలు 6:4-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు. చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు. కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక! రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము. రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.” కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు. అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు.