దాని 6:4-10

దాని 6:4-10 IRVTEL

అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు. అప్పుడు ఆ ప్రధానమంత్రులు, అధికారులు రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. వాళ్ళు రాజుతో ఇలా చెప్పారు. “రాజువైన దర్యావేషూ, నువ్వు చిరకాలం జీవిస్తావు గాక. ఈ దేశంలోని పాలకులు, ప్రముఖులు, అధికారులు, మంత్రులు, సంస్థానాల అధిపతులు అందరూ సమావేశమై రాజు కోసం ఒక కచ్చితమైన చట్టం సిద్ధం చేసి దాన్ని రాజు ఆజ్ఞగా చాటించాలని ఆలోచన చేశారు. అది ఏమిటంటే దేశంలోని ప్రజల్లో ఎవ్వరూ 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ ఇతర దేవునికీ, ఏ ఇతర మనిషికీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలి. అందువల్ల రాజా, ఈ ప్రకారంగా రాయించి రాజ శాసనం సిద్ధం చేయండి. మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు. అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు. ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.