దానియేలు 6:4-10

దానియేలు 6:4-10 TERV

కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యాధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొనలేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజును మోసగించలేదు. కష్టించి పని చేసాడు. చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు. అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి. ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసివేయబడతాడు. రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి, ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు. అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి, కాగితంపై సంతకం పెట్టాడు. దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.

Read దానియేలు 6