దానియేలు 3:14-27
దానియేలు 3:14-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను – షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి–నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి–షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి–మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడిగెను. వారు–రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి. అందుకు రాజు–నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి–షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి. అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.
దానియేలు 3:14-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా? బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు. రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.” వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు. తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు. రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు.
దానియేలు 3:14-27 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!” షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.” అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. కొలిమి మామూలుకంటె ఏడు రెట్లు వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వేడి కొలిమిలోకి తోసివేయుమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి తోసివేశారు. వాళ్లను మంటలోకి విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండటంవల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే, ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలి చచ్చారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి అగ్నిగుండంలోకి త్రోసేశారు. అప్పుడు జరిగింది చూసి నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాముగదా!” అని అడిగాడు. “చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు. “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగాగాని, కాలిపోయినట్టుగాగాని లేరు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు. తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా! బయటికి రండి” అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు. వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళమీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకొన్నారు.
దానియేలు 3:14-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా? ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు. అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి, తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు. రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు. “అవును రాజా!” అని వారు జవాబిచ్చారు. అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు. అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు. కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు.