దాని 3:14-27

దాని 3:14-27 IRVTEL

అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా? బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు. రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.” వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు. తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు. రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు.

Free Reading Plans and Devotionals related to దాని 3:14-27