అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా? ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు.
షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు.
అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి, తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు. రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు.
అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు.
“అవును రాజా!” అని వారు జవాబిచ్చారు.
అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు.
అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు.
కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు.