దానియేలు 2:1-28
దానియేలు 2:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నెబుకద్నెజరు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో అతడు కలలు కన్నాడు; వాటివలన అతని మనస్సు కలతచెందింది, అతడు పడుకోలేకపోయాడు. కాబట్టి అతడు తనకు వచ్చిన కలను చెప్పడానికి మాంత్రికులను, శకునగాళ్లను, గారడీవారిని, జ్యోతిష్యులను పిలిపించాడు. వారు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డారు. రాజు వారితో, “నాకు కల వచ్చింది, అది నన్ను కలవరపెడుతుంది, దాని భావం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు. రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను. కాని ఒకవేళ మీరు నా కలను, దాని భావాన్ని చెప్తే మీకు కానుకలు, బహుమానాలు, గొప్ప ఘనతను ఇస్తాను. కాబట్టి నాకు వచ్చిన కలను చెప్పి, దాని భావాన్ని వివరించండి” అన్నాడు. అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు. అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, “నాకు వచ్చిన కలను నేను మరచిపోయాను కాబట్టి మీరు కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు వచ్చిన కలను మీరు చెప్పకపోతే, మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. పరిస్థితి మారాలని నన్ను తప్పుదారి పట్టించే మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కలను చెప్పండి, అప్పుడు మీరు కల భావం చెప్పగలరని నేను తెలుసుకుంటాను.” కల్దీయ జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ ఇలా అన్నారు, “రాజు అడిగింది చెప్పేవారు భూమిపై ఎవరూ లేరు! ఏ రాజు ఏ అధిపతి ఏ అధికారి ఇలాంటి విషయాన్ని ఏ శకునగాడిని గాని మాంత్రికున్ని గాని జ్యోతిష్యున్ని గాని ఇప్పటివరకు అడగలేదు. రాజు అడిగేది కష్టతరమైనది. దేవుళ్ళు తప్ప ఎవరూ దానిని రాజుకు తెలియజేయలేరు, అయితే వారేమో మానవుల మధ్య నివసించరు.” ఇది రాజుకు తీవ్రమైన కోపాన్ని పుట్టించగా అతడు బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆదేశించాడు. జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు. రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు. “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు. తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు. దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు. ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక; జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి. ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని ఇస్తారు. ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు; చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు, వెలుగు ఆయనతో నివసిస్తుంది. నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను: మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు, మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు, రాజు కలను మీరు మాకు తెలియజేశారు.” అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు. వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు. రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు. దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు. అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి
దానియేలు 2:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు. తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు. అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలలను నేను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పాలి. చెప్పని పక్షంలో మిమ్మల్ని ఖండ ఖండాలుగా నరికిస్తాను. మీ ఇళ్ళను నేలమట్టం చేయిస్తాను. కలనూ దాని భావాన్నీ చెప్పిన వాళ్ళకు కానుకలు, బహుమతులు ఇస్తాను. వాళ్ళు నా సమక్షంలో సత్కరిస్తాను. కాబట్టి నా కలను, దాని భావాన్ని చెప్పండి” అన్నాడు. అప్పుడు వాళ్ళంతా “రాజా, మీకు వచ్చిన ఆ కలను మీ దాసులమైన మాకు చెప్పిన పక్షంలో మేము దాని భావం చెబుతాము” అని మళ్ళీ జవాబిచ్చారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను నేను మరచిపోవడం వల్ల మీరు తాత్సారం చేయాలని చూస్తున్నట్టు నేను గ్రహించాను. నా సన్నిధిలో అబద్ధాలు, వంచన మాటలు పలుకుతూ యుక్తిగా కాలయాపన చేయాలని చూస్తున్నారు. మీరు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పకపోతే నేను కచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను కాబట్టి ముందు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పండి. అప్పుడు ఆ కలకు అర్థం చెప్పడానికి మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను” అన్నాడు. అప్పుడు జోతిష్యులు ఇలా జవాబిచ్చారు. “రాజు అడిగిన విషయం చెప్పగలిగినవాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఇంతవరకూ ఏ చక్రవర్తి, ఏ రాజూ, ఏ పరిపాలకుడూ ఇలాంటి విషయం చెప్పమని ఏ జోతిష్యుడినీ, మాంత్రికుడినీ, శకునజ్ఞుడినీ కోరలేదు. రాజు తెలుసుకోవాలని కోరిన విషయం కష్టతరం. దీన్ని దేవుళ్ళు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. దేవుళ్ళు మనుషుల మధ్య నివసించరు గదా.” అది విని రాజు తీవ్ర కోపం తెచ్చుకున్నాడు. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులనందరినీ హతమార్చాలని ఆజ్ఞ జారీ చేశాడు. జ్ఞానులను హతమార్చాలని రాజు ఇచ్చిన ఆజ్ఞను అమలు చేయడానికి సైనికులు బయలుదేరారు. ఆ క్రమంలో దానియేలును, అతని స్నేహితులను కూడా చంపాలని వెదుకుతున్నారు. బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి బయలుదేరిన సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. రాజు ఇలాంటి ఆజ్ఞ ఇంత త్వరగా ఎందుకు జారీ చేశాడని అడిగాడు. అర్యోకు జరిగిన విషయమంతా దానియేలుకు వివరించాడు. దానియేలు రాజుకు వచ్చిన కల భావం తెలియజేయడానికి తనకు కొంత గడువు ఇవ్వమని రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు. తరువాత దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు విషయం తెలియజేశాడు. తనకు, తన స్నేహితులకు, బబులోనులో ఉన్న మిగిలిన జ్ఞానులకు రాబోతున్న ఆపద తప్పిపోయేలా రాజుకు వచ్చిన కల, ఆ కల భావం తెలియడానికి పరలోకంలో ఉన్న దేవుని నుండి దయ కలిగేలా దేవుణ్ణి వేడుకొమ్మని వాళ్ళను హెచ్చరించాడు. ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు, “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు. ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే, ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.” జ్ఞానులను సంహరించడానికి రాజు నియమించిన రాజ సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో “బబులోనులో ఉన్న జ్ఞానులను చంపవద్దు. నన్ను రాజు సన్నిధికి తీసుకు వెళ్ళు. నేను ఆ కల భావాన్ని రాజుకు తెలియజేస్తాను” అని చెప్పాడు. అర్యోకు రాజ సన్నిధికి వెళ్లి “రాజుకు వచ్చిన కల భావం తెలియ జేయగలిగే ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. అతడు చెరపట్టి తీసుకువచ్చిన యూదుల్లో ఒకడు” అని చెప్పి, వెంటనే దానియేలును రాజమందిరానికి తీసుకు వెళ్ళాడు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను, దాని భావాన్ని నువ్వు వివరించగలవా?” అని బెల్తెషాజరు అనే దానియేలును అడిగాడు. దానియేలు రాజు ఎదుట నిలబడి ఇలా జవాబిచ్చాడు. “రాజు కోరినట్టు ఈ మర్మం వివరించడం జ్ఞానులకైనా, గారడీ విద్యలు చేసేవాళ్ళకైనా, శకునం చెప్పేవాళ్ళకైనా, జ్యోతిష్యులకైనా సాధ్యం కాదు. అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను.
దానియేలు 2:1-28 పవిత్ర బైబిల్ (TERV)
నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పమని రాజు వారిని అడిగాడు. అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలత పెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి” తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు. అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను. కాని మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు. మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు. అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా నాతో వ్యర్థమైన మాటలు, అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలనుగురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కలయొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.” అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు: “రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల ప్యక్తి ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, ఇంద్రజాలికుల్నిగాని, కల్దీయుల్నిగాని అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, ఏ మహా శక్తివంతుడైన రాజుగాని అడుగలేదు. చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.” ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై, బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపమని ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు. అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?” అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు. దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు. ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు. “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి; శక్తియు, వివేకమును ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు. దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు. ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు. ఆయనే మనుష్యులకు వివేకమిస్తాడు. కనుక, వారు వివేకవంతులౌతారు. జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతులవుతారు. గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు. చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు ఆయనలో నివసిస్తుంది. మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను. నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు. నీవు రాజు కన్న కలను, దాని అర్థాన్ని తెలియజేశావు. మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు. తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు. దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు. రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?” దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి.
దానియేలు 2:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి. రాజు వారితో–నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి– రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము. రాజు–నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు –రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా – నేను మరచి యుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపుమాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్పలేకపోయినయెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి–భూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరులమధ్య ఉండవుగదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను –రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతోకూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లి–బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను. కావున అర్యోకు–రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కను గొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను. రాజు–నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను–రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా
దానియేలు 2:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)