నెబుకద్నెజరు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో అతడు కలలు కన్నాడు; వాటివలన అతని మనస్సు కలతచెందింది, అతడు పడుకోలేకపోయాడు. కాబట్టి అతడు తనకు వచ్చిన కలను చెప్పడానికి మాంత్రికులను, శకునగాళ్లను, గారడీవారిని, జ్యోతిష్యులను పిలిపించాడు. వారు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డారు. రాజు వారితో, “నాకు కల వచ్చింది, అది నన్ను కలవరపెడుతుంది, దాని భావం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని అన్నాడు.
అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు.
రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను. కాని ఒకవేళ మీరు నా కలను, దాని భావాన్ని చెప్తే మీకు కానుకలు, బహుమానాలు, గొప్ప ఘనతను ఇస్తాను. కాబట్టి నాకు వచ్చిన కలను చెప్పి, దాని భావాన్ని వివరించండి” అన్నాడు.
అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు.
అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, “నాకు వచ్చిన కలను నేను మరచిపోయాను కాబట్టి మీరు కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు వచ్చిన కలను మీరు చెప్పకపోతే, మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. పరిస్థితి మారాలని నన్ను తప్పుదారి పట్టించే మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కలను చెప్పండి, అప్పుడు మీరు కల భావం చెప్పగలరని నేను తెలుసుకుంటాను.”
కల్దీయ జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ ఇలా అన్నారు, “రాజు అడిగింది చెప్పేవారు భూమిపై ఎవరూ లేరు! ఏ రాజు ఏ అధిపతి ఏ అధికారి ఇలాంటి విషయాన్ని ఏ శకునగాడిని గాని మాంత్రికున్ని గాని జ్యోతిష్యున్ని గాని ఇప్పటివరకు అడగలేదు. రాజు అడిగేది కష్టతరమైనది. దేవుళ్ళు తప్ప ఎవరూ దానిని రాజుకు తెలియజేయలేరు, అయితే వారేమో మానవుల మధ్య నివసించరు.”
ఇది రాజుకు తీవ్రమైన కోపాన్ని పుట్టించగా అతడు బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆదేశించాడు. జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు.
రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు. “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు.
తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు. దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు. ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ, ఇలా అన్నాడు:
“దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక;
జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.
ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు;
ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు.
ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని,
వివేకులకు వివేకాన్ని ఇస్తారు.
ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు;
చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు,
వెలుగు ఆయనతో నివసిస్తుంది.
నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను:
మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు,
మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు,
రాజు కలను మీరు మాకు తెలియజేశారు.”
అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు.
వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు.
రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు.
దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు. అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి