నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పమని రాజు వారిని అడిగాడు.
అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలత పెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి” తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.
అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను. కాని మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు.
మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.
అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా నాతో వ్యర్థమైన మాటలు, అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలనుగురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కలయొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”
అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు: “రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల ప్యక్తి ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, ఇంద్రజాలికుల్నిగాని, కల్దీయుల్నిగాని అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, ఏ మహా శక్తివంతుడైన రాజుగాని అడుగలేదు. చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.”
ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై, బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపమని ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు.
అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?”
అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.
దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.
ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.
“నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి;
శక్తియు, వివేకమును ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు.
ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు.
ఆయనే మనుష్యులకు వివేకమిస్తాడు.
కనుక, వారు వివేకవంతులౌతారు.
జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతులవుతారు.
గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు.
చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు.
వెలుగు ఆయనలో నివసిస్తుంది.
మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను.
నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు.
నీవు రాజు కన్న కలను, దాని అర్థాన్ని తెలియజేశావు.
మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.
తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.
దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.
రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”
దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి.