దానియేలు 1:4-19

దానియేలు 1:4-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి. రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి. యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు. ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు. అయితే దానియేలు, రాజు ఇచ్చే ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుని తనను తాను అపవిత్రపరచుకోవద్దని నిర్ణయించుకొని, తాను అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తినకుండా ఉండడానికి ప్రధాన అధికారి అనుమతి కోరాడు. ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు. కాబట్టి ఆ అధికారి దానియేలుతో, “మీకు ఆహారం పానీయం కేటాయించిన నా ప్రభువైన నా రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయస్సు యువకుల కంటే మీరు అతనికి ఎందుకు పీక్కుపోయినట్టుగా కనిపించాలి? అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి నా తల నరికేస్తాడు” అన్నాడు. అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు, “దయచేసి పది రోజులపాటు మీ దాసులను పరీక్షించి చూడండి: మాకు కూరగాయలు, త్రాగడానికి నీళ్లు తప్ప ఏమి ఇవ్వకండి. ఆ తర్వాత రాజాహారం తిన్న యువకులతో మా ముఖాలను పోల్చి చూసిన తర్వాత మీకు నచ్చినట్లు మాకు చేయండి” అని అన్నాడు. అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు. పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు. కాబట్టి ఆ నాయకుడు రాజు ఆహారాన్ని, వారు త్రాగవలసిన ద్రాక్షరసాన్ని తీసివేసి వారికి కూరగాయలు పెట్టాడు. ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. వారిని రాజు సేవకై తీసుకువచ్చే సమయం సమీపించినప్పుడు, ప్రముఖ అధికారి వారిని నెబుకద్నెజరు సమక్షంలో నిలబెట్టాడు. రాజు వారితో మాట్లాడారు, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకు సమానం ఎవరూ లేరని కనుగొన్నాడు; కాబట్టి వారిని రాజు సేవకు నియమించాడు.

దానియేలు 1:4-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎలాంటి లోపాలు లేకుండా అందం, తెలివితేటలు, జ్ఞాన వివేకాలు కలిగి ఉన్నవాళ్ళను తెమ్మని చెప్పాడు. అతడు వాళ్ళకు ప్రావీణ్యత కలిగేలా కల్దీయ భాష, సాహిత్యం నేర్పించాలి. రాజు “వారికి ప్రతి రోజూ నేను తినే ఆహారం, తాగే ద్రాక్షారసం ఇవ్వండి. ఆ విధంగా మూడు సంవత్సరాలపాటు వాళ్ళకు శిక్షణ ఇచ్చిన తరువాత వారు నా కొలువులో సేవకులుగా ఉండాలి.” బందీలుగా వెళ్ళిన యూదుల్లో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే యువకులు ఉన్నారు. నపుంసకుల అధికారి దానియేలుకు బెల్తెషాజరు అనీ, హనన్యాకు షద్రకు అనీ, మిషాయేలుకు మేషాకు అనీ, అజర్యాకు అబేద్నెగో అనీ పేర్లు మార్చాడు. రాజు తినే ఆహారం, తాగే ద్రాక్షారసం పుచ్చుకుని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. వాటిని తిని, తాగి అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తమకు వడ్డించకుండా చూడమని నపుంసకుల అధికారి దగ్గర అనుమతి కోరుకున్నాడు. దేవుడు ముఖ్య అధికారికి దానియేలు పట్ల దయ, అభిమానం కలిగేలా చేశాడు. ఆ అధిపతి దానియేలుతో “మీకు రాజ భోజనం, ద్రాక్షారసం వడ్డించమని నాకు ఆజ్ఞాపించిన నా యజమానియైన రాజు గురించి నేను భయపడుతున్నాను. మీతోపాటు ఉన్న ఇతర యువకుల ముఖాల కంటే మీ ముఖాలు పాలిపోయి ఉన్నట్టు రాజు కనిపెట్టినప్పుడు మీవల్ల నాకు రాజునుండి ప్రాణాపాయం కలుగుతుంది” అన్నాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై ముఖ్య అధికారి నియమించిన పర్యవేక్షకునితో దానియేలు మాట్లాడాడు. “నీ దాసులమైన మాకు తినడానికి శాకాహారం, తాగడానికి మంచినీళ్లు మాత్రం ఇప్పించు. అలా పది రోజులపాటు ఇచ్చి మమ్మల్ని పరీక్షించు. తరువాత మా ముఖాలను, రాజు నియమించిన భోజనం తిన్న ఇతర యువకుల ముఖాలను పరీక్షించి నీకు తోచినట్టు నీ దాసులమైన మా పట్ల జరిగించు.” ఆ పర్యవేక్షకుడు అందుకు అంగీకరించాడు. పది రోజులపాటు వాళ్ళను పరీక్షించాడు. పది రోజుల గడిచాయి. రాజు నియమించిన భోజనం తినే యువకుల ముఖాల కంటే వీరి ముఖాలు ఆరోగ్యకరంగా కళకళలాడుతూ కనిపించాయి. ఆ పర్యవేక్షకుడు రాజు వాళ్లకు ఇవ్వమని చెప్పిన మాంసాహారం, ద్రాక్షారసం స్థానంలో శాకాహారం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ నలుగురు యువకుల విషయం ఏమిటంటే, దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, తెలివితేటలు అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధాలైన దైవదర్శనాలకు, కలలకు అర్థాలు, భావాలు వివరించగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు. గడువు ముగిసిన తరువాత ఆ యువకులను తన ఎదుట ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నపుంసకుల అధికారి వాళ్ళను రాజు సమక్షంలో నిలబెట్టాడు. రాజు వాళ్ళను పరిశీలించాడు. వాళ్ళందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలతో సాటియైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. కాబట్టి రాజు వాళ్ళను తన ఆస్థానంలో ఉద్యోగులుగా నియమించాడు.

దానియేలు 1:4-19 పవిత్ర బైబిల్ (TERV)

ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైనవారు, తేలికగా విషయాలు నేర్చుకునేవారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతిరోజు రాజు తిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు. ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు యూదా దేశానికి చెందినవారు. తర్వాత అష్పెనజు యూదానుంచి వచ్చిన ఆ యువకులకు బబులోనీయుల పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు అని పేర్లు పెట్టాడు. రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యంతో తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించమని అష్పెనజు అనుమతి కోరాడు. దానియేలుపట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేశాడు. కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించకపోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసువారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు: “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు. పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిర్ణయమో అలాగే చెయ్యి” అని అన్నాడు. అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు. పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు. అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు. దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్త్రాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు. ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకువెళ్లాడు. రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు.

దానియేలు 1:3-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను – ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి. నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను –మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను. భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను. పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.

దానియేలు 1:4-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)